

ఐర్లాండ్‌లోని షానన్ విమానాశ్రయంలో పార్క్ చేసి ఉన్న అమెరికా సైనిక రవాణా విమానం సీ-130హెచ్ హెర్క్యులస్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 48 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 11న ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు డైథీ ఓకొర్రిన్.. డేవిడ్ కరన్ అనే తప్పుడు పేరుతో విమానాశ్రయ భద్రతా తనిఖీలను దాటి ట్యాక్సీవేపై ఉన్న విమానం వద్దకు చేరుకున్నట్లు సమాచారం. విమానం వెనుక తలుపు తాళాలను బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించిన అతడు.. వైర్ బండిల్స్, హైడ్రాలిక్ లైన్లు, కాక్‌పిట్ గేజ్‌లు, ఎయిర్ డక్ట్‌లను ధ్వంసం చేసినట్లు కథనం పేర్కొంది.
విమానంలో ఉపయోగించే అల్యూమినియాన్ని దెబ్బతీసే గాలియం ద్రవాన్ని కూడా నిందితుడు వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఇంధన ట్యాంకు తాళాలను తొలగించి, అందులో బాల్ బేరింగ్స్ వేసినట్లు సమాచారం. పైకప్పు హాచ్ ద్వారా బయటకు వచ్చిన అతడిని భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించి విమానం పైభాగంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఈ విమానం విలువ సుమారు 60 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.560 కోట్లు) ఉంటుందని అంచనా. విమాన వ్యవస్థలపై నిందితుడికి అవగాహన ఉండటం, గాలియం క్యాప్సుల్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు గుర్తించడంతో ఈ దాడి ముందస్తు ప్రణాళికతో జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!