

గుజరాత్‌లోని నర్మదా జిల్లా ఏక్తానగర్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద అక్టోబర్ 5, 6 తేదీల్లో జరిగే చింతన్ శివిర్-2026కు తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరవుతున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన ఈ రెండురోజుల సదస్సు నిర్వహిస్తున్నారు. పీఎం గతిశక్తి, రహదారి మౌలిక వసతుల అభివృద్ధి, ప్రాజెక్టుల అమలులో కేంద్ర-రాష్ట్రాల సమన్వయం వంటి అంశాలపై ఇందులో చర్చించనున్నారు. మంత్రి వెంట ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, పలువురు చీఫ్ ఇంజినీర్లు వెళ్లారు. గుజరాత్ పర్యటనకు ముందు కోమటిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణలోని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు.
చింతన్ శివిర్ సందర్భంగా తెలంగాణలోని కీలక రహదారి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చర్చించనున్నారు. ఏక్తానగర్ చేరుకున్న అనంతరం మంత్రి ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్ సంతోష్ యాదవ్‌తో భేటీ అయి రాష్ట్రంలోని ప్రాజెక్టులు, వాటి పురోగతిపై చర్చించారు. తన కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం దేశంలో రహదారుల అభివృద్ధికి గడ్కరీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాలకు సహకరిస్తున్నారని కోమటిరెడ్డి పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!