

కొడంగల్ నియోజకవర్గంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గానికి కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి పైప్‌లైన్ నెట్‌వర్క్ ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.490 కోట్లతో భారీ పథకాన్ని రూపొందించి పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. కోస్గి, కొడంగల్, మద్దూరు మునిసిపాలిటీలతో పాటు పలు గ్రామాలు, లగచర్ల మల్టీపర్పస్ పారిశ్రామిక కారిడార్, హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ పథకం ప్రకారం కోయిల్‌సాగర్ నుంచి పోలేపల్లి శివారు వరకు భారీ మోటార్ల సాయంతో నీటిని ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి గ్రావిటీ విధానంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 40 మిలియన్ లీటర్ల (40 ఎంఎల్‌డీ) నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో కోస్గి మునిసిపాలిటీకి 6 ఎంఎల్‌డీ, కొడంగల్‌కు 3 ఎంఎల్‌డీ, మద్దూరుకు 3 ఎంఎల్‌డీ కేటాయించారు. లగచర్ల పారిశ్రామిక కారిడార్‌కు 15 ఎంఎల్‌డీ, హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్‌కు 2 ఎంఎల్‌డీ సరఫరా చేయనున్నారు. సర్జఖాన్‌పేట్, తోగాపూర్, పోలేపల్లి, హకీంపేట్, లగచర్ల తదితర గ్రామాలకు మరో 3 ఎంఎల్‌డీ అందించనున్నారు. టెండర్లు, ఒప్పందాల ప్రక్రియ పూర్తయిన తర్వాత పనులు ప్రారంభించి 2027 చివరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!