

కాకినాడలో భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (ఇన్‌కాయిస్) ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దిశగా సాగుతోందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. ఈ మేరకు తెదేపా ఎంపీ సానా సతీశ్‌కు లేఖ రాశారు. కాకినాడలో ఇన్‌కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయాలని సానా సతీశ్ జులై 21న కేంద్రమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపాదన పురోగతిపై ఎంపీకి జితేంద్రసింగ్ సమాచారం అందించారు.
ప్రతిపాదిత కేంద్రం కోసం జిల్లా యంత్రాంగం ఇప్పటికే భూమిని గుర్తించింది. సంబంధిత శాఖ ఆమోదం కోసం ప్రతిపాదనను అధికారులు పంపారు. ఇన్‌కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటైతే సముద్ర భద్రతను బలోపేతం చేయడంతోపాటు మత్స్యకారుల జీవనోపాధికి ఉపయోగపడే అవకాశం ఉంది. తీర ప్రాంత మత్స్యకారులకు సముద్ర సమాచార సేవలు మరింత చేరువ కానున్నాయి. అలాగే పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ సమాచారంతో పాటు ఇతర కీలక సముద్ర సమాచారాన్ని సకాలంలో పొందే అవకాశం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఎంపీ సానా సతీశ్ తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!