

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా ఈవోఎస్-05 ఉపగ్రహాన్ని సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2.55 గంటలకు నింగిలోకి పంపనుంది. జీఎస్‌ఎల్‌వీకి ఇది 19వ ప్రయోగం. ప్రస్తుతం ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. రాకెట్ ఈవోఎస్-05ను తొలుత సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనుంది. అనంతరం ఉపగ్రహం తన సొంత ప్రొపల్షన్ వ్యవస్థ ద్వారా నిర్దేశిత కక్ష్యకు చేరుకోనుంది. భూస్థిర కక్ష్య నుంచి పనిచేసే తొలి భారత ఇమేజింగ్ ఉపగ్రహంగా ఈవోఎస్-05 ప్రత్యేకత సంతరించుకుంది.
భూమికి దాదాపు 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్య నుంచి ఈవోఎస్-05 భారత ప్రాంతాలను తరచూ, అత్యంత వివరంగా చిత్రీకరించనుంది. వాతావరణ పరిస్థితుల పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, పర్యావరణ పరిశీలన వంటి రంగాలకు ఇది కీలక సమాచారాన్ని అందించనుంది. అంతేకాకుండా వ్యూహాత్మక, భద్రతాపరమైన పర్యవేక్షణ సామర్థ్యాలను కూడా పెంచనుంది. ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాలపై తరచూ నిఘా ఉంచేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. భూస్థిర కక్ష్యలో ఇమేజింగ్ సామర్థ్యాన్ని సాధించేందుకు చేపడుతున్న ఈ ప్రయోగం భారత అంతరిక్ష ఆధారిత పరిశీలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!