

తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ క్లైమేట్ కాన్‌క్లేవ్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ‘ఇన్వెస్ట్ తెలంగాణ – గ్లోబల్ సమ్మిట్ 2026’లో భాగంగా రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ నిపుణులు, ప్రముఖులు ఇందులో పాల్గొనేలా ఆహ్వానాలు పంపించనున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం, హరిత పెట్టుబడులు, నీటి భద్రత, ఎల్‌నినో ప్రభావాలను ఎదుర్కొనే ముందస్తు ప్రణాళికలు ప్రధాన చర్చాంశాలుగా ఉండనున్నాయి. సోమవారం సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సదస్సు ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత, వ్యవసాయ సంక్షోభం, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున రాష్ట్రం ముందస్తుగా సిద్ధం కావాలని సూచించారు. వేసవిలో తాగునీటి భద్రత, పశుగ్రాసం లభ్యత, బలహీన వర్గాల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
ఈ సదస్సుకు పర్యావరణవేత్తలు రాజేంద్ర సింగ్, సునీతా నారాయణ్, సద్గురు, నార్వే మాజీ పర్యావరణ మంత్రి ఎరిక్ సోల్హీమ్‌లను ఆహ్వానించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. సినీ నటి దియా మీర్జాను ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానించాలనే ప్రతిపాదన కూడా ఉంది. కేంద్ర మంత్రులు, విదేశీ రాయబారులు, జాతీయ స్థాయి ప్రముఖులను సైతం ఆహ్వానించనున్నారు. స్వచ్ఛమైన గాలి, పునరుత్పాదక ఇంధనం, క్లైమేట్ ఫైనాన్స్, నీటి సంరక్షణ, హరిత సాంకేతికతలు, సుస్థిర మౌలిక వసతులు వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలను ప్రదర్శించనున్నారు. నవంబర్ 28న వివిధ రంగాలకు చెందిన సుమారు 100 మంది ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని నిర్ణయించారు. కరువు నివారణ, నీటి భద్రత, అటవీ విస్తరణ, ఎడారీకరణ, వ్యర్థాల నుంచి సంపద సృష్టి వంటి అంశాలపై లోతైన చర్చలు జరిపి, అమలు చేయగల కార్యాచరణ ప్రణాళిక రూపొందించడమే సదస్సు ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!