

బతుకుదెరువు కోసం మలేసియా వెళ్లిన ఓ యువకుడు ఏజెంట్ మోసానికి గురై గత నాలుగు నెలలుగా అక్కడి జైలులో మగ్గుతున్నాడు. తన భర్తను విడిపించి స్వదేశానికి తీసుకురావాలని బాధితుడి భార్య మౌనిక ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే.. మోడేగావ్కు చెందిన ఓ వ్యక్తి తాడ్వాయి మండలానికి చెందిన అజ్జపల్లి సురేష్‌కు కంపెనీ వీసాపై ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి రూ.1.40 లక్షలు వసూలు చేశాడు. అనంతరం జూన్ 4న సురేష్‌ను మలేసియాకు పంపించాడు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత అది కంపెనీ వీసా కాదని, టూరిస్ట్ వీసా అని సురేష్ గుర్తించాడు. జులై 6న అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉండటంతో పోలీసులు అతడిని జైలుకు తరలించారు.
గత నాలుగు నెలలుగా జైలు జీవితం అనుభవిస్తూ ఇబ్బందులు పడుతున్నట్లు సురేష్ కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. దీంతో తెలిసినవారి ద్వారా కుటుంబసభ్యులు ఏజెంట్‌ను సంప్రదించగా.. కామారెడ్డికి చెందిన శ్యాంరాజ్ మలేసియాలోనే ఉన్నాడని, అతడిని సంప్రదిస్తే సురేష్‌ను విడిపిస్తాడని సూచించారు. ఈ మేరకు శ్యాంరాజ్తో మాట్లాడగా.. విడుదల చేయించేందుకు రూ.లక్ష ఖర్చవుతుందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆ మొత్తాన్ని చెల్లించారు. ఆ తర్వాత మరో రూ.70 వేలు కావాలని కోరడంతో మౌనిక తన బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి డబ్బు సమకూర్చింది. అయినప్పటికీ సురేష్ విడుదల కాకపోవడంతో మౌనిక తాడ్వాయి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తన భర్తను స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం, అధికారులు చొరవ చూపాలని కోరుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!