

అధునాతన ఆరోతరం యుద్ధవిమానం అభివృద్ధి దిశగా భారత్ కసరత్తు ప్రారంభించిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ ప్రయత్నంలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ పట్టుదలతో వాటిని అధిగమిస్తామని అన్నారు. వచ్చే రెండు దశాబ్దాల్లో మారనున్న యుద్ధరీతులను దృష్టిలో ఉంచుకుని దేశ సైనిక సామర్థ్యాలను పెంచుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అధికారిక విధానంగా కొనసాగిస్తున్నంత కాలం పొరుగు దేశంపై అన్ని రకాల దాడులు చేసే హక్కు భారత్‌కు ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఐదోతరం యుద్ధశకంలో ఉందని వ్యాఖ్యానించారు.
భూమి, సముద్రం, వాయు, సైబర్, అంతరిక్షం, మానవ మేధస్సు వంటి రంగాలు యుద్ధ క్షేత్రాలుగా మారుతున్నాయని రాజ్‌నాథ్ తెలిపారు. డ్రోన్లు, కృత్రిమ మేధ, క్వాంటమ్ సాంకేతికత, హైపర్‌సోనిక్ ఆయుధాలు రక్షణ రంగంలో వేగంగా మార్పులు తీసుకొస్తున్నాయని చెప్పారు. ఆధునిక యుద్ధంలో ఎలక్ట్రానిక్, సమాచార యుద్ధ పద్ధతులతో పాటు స్వయంప్రతిపత్తి వ్యవస్థలు, అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు కీలకంగా మారాయని వివరించారు. సాంకేతికంగా ముందున్న దేశాలు యుద్ధరంగంలో ఆధిక్యం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఇదిలా ఉండగా, భారత రక్షణ ఎగుమతులు 2013-14లో రూ.686 కోట్ల నుంచి 2025-26లో రికార్డు స్థాయిలో రూ.38,424 కోట్లకు చేరాయి. 2029 నాటికి రూ.50 వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!