

తాను సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండనని నటి రమ్యకృష్ణ తెలిపారు. వృత్తిపరమైన విషయాలు తప్ప వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను ఇతరులతో పంచుకోవడం తనకు ఇష్టం ఉండదని చెప్పారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 14 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినట్లు గుర్తుచేసుకున్నారు. తన భరతనాట్యం అరంగేట్రం ఫొటోలు చూసిన దర్శకులు భారతీరాజా, టి.రాజేందర్ తనను సంప్రదించారని తెలిపారు. ఇక ‘అమ్మోరు’ సినిమా షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న కష్టాలను కూడా పంచుకున్నారు. ముఖ్యంగా పది చేతుల సన్నివేశం కోసం గంటల తరబడి కదలకుండా ఉండాల్సి వచ్చేదని, వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు కూడా అవకాశం ఉండేది కాదని చెప్పారు. అప్పట్లో కారవాన్లు కూడా అందుబాటులో లేవని గుర్తుచేసుకున్నారు.
దర్శకుడు కృష్ణవంశీతో తన వైవాహిక బంధం గురించి కూడా రమ్యకృష్ణ మాట్లాడారు. తామిద్దరం ఇప్పటికీ భార్యాభర్తలమేనని, అయితే వృత్తిపరమైన పరిస్థితుల కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నామని స్పష్టం చేశారు. తమ కుమారుడు చిన్నవాడిగా ఉన్నప్పుడు తాను సీరియళ్లలో బిజీగా ఉండటంతో తరచూ చెన్నై నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించేదాన్నని తెలిపారు. అలా ప్రయాణించిన ప్రతిసారీ కుమారుడి ఆరోగ్యం దెబ్బతినడంతో అతడిని చెన్నైలోనే చదివించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కృష్ణవంశీతో తరచూ గొడవలు పడటం కంటే మంచి స్నేహితుల్లా ఉండటమే తమకు ఇష్టమని పేర్కొన్నారు. ఆయన తన పని విషయంలో జోక్యం చేసుకోరని, తాను కూడా ఆయన వృత్తిపరమైన విషయాల్లో జోక్యం చేసుకోనని తెలిపారు. ప్రస్తుతం ఇద్దరం సంతోషంగా ఉన్నామని రమ్యకృష్ణ వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!