

రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేసే వినియోగదారులకు అక్కడి వంటగది పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే అవకాశం సాధారణంగా ఉండదు. ఆహారం ఎలా తయారు చేస్తున్నారు? సిబ్బంది పరిశుభ్రత పాటిస్తున్నారా? కిచెన్ ఎంత శుభ్రంగా ఉంది? అనే విషయాలు బయటకు కనిపించవు. ఈ సమస్యకు పరిష్కారంగా నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో వంటగది పారదర్శకతను పెంచేందుకు టీజీసేఫ్ కొత్త కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి రెస్టారెంట్, హోటల్ కిచెన్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి ప్రత్యక్ష దృశ్యాలను బిల్లింగ్ కౌంటర్ వద్ద మానిటర్లపై ప్రదర్శించనున్నారు. దీంతో వినియోగదారులు వంటగదిలోకి వెళ్లకుండానే అక్కడి పరిశుభ్రత, ఆహార తయారీ విధానాన్ని పరిశీలించవచ్చు. ఇటీవల టీజీసేఫ్ అధికారులతో జరిగిన సమావేశంలో నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్లు సమాచారం. బిల్లు చెల్లించే సమయంలో కిచెన్ పరిస్థితులను చూసి సంతృప్తి చెందితేనే అక్కడ భోజనం చేయవచ్చని, లేదంటే మరో హోటల్‌కు వెళ్లవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానం వల్ల నిర్వాహకులు పరిశుభ్రతపై మరింత శ్రద్ధ చూపుతారని అంచనా వేస్తున్నారు. త్వరలో జంట నగరాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు టీజీసేఫ్ డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ ఆనందరావు తెలిపారు.
వంటగదుల్లో పరిశుభ్రతకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. వంటగదులు టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థలు, చెత్త నిల్వ చేసే ప్రాంతాలకు దూరంగా ఉండాలి. వంట చేసేవారు క్యాప్, అప్రాన్, గ్లౌజులు ధరించాలి. గోళ్లు పెంచడం, వాచ్‌లు, ఉంగరాలు ధరించడం నివారించాలి. జ్వరం, దగ్గు, చర్మవ్యాధులు ఉన్నవారిని ఆహార తయారీకి దూరంగా ఉంచాలి. సిబ్బందికి ప్రతి ఆరు నెలలకోసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. నేల సులభంగా శుభ్రం చేసేలా, జారిపోకుండా ఉండాలి. గోడలకు కనీసం ఐదు అడుగుల ఎత్తు వరకు టైల్స్ వేయాలి. వంటగదిలో తగిన వెలుతురు, గాలి ప్రసరణ ఉండటంతో పాటు చిమ్నీ, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి. పచ్చి మాంసం, కూరగాయలు, వండిన ఆహారాన్ని వేర్వేరుగా నిల్వ చేయాలి. మూత ఉన్న చెత్త డబ్బాలను ఏర్పాటు చేసి, వ్యర్థాలను ప్రతిరోజూ తొలగించాలి. ఎలుకలు, బొద్దింకలు, ఈగలు రాకుండా పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టాలి. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులను కనిపించేలా ప్రదర్శించాలి. వంట నూనెలో టోటల్ పోలార్ కాంపౌండ్స్ (టీపీసీ) స్థాయి 25 శాతం దాటితే ఆ నూనెను వినియోగించకూడదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!