

పౌల్ట్రీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) వ్యాప్తిని నియంత్రించే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు దేశంలోనే తొలిసారిగా స్వదేశీ టీకాను అభివృద్ధి చేసింది. భోపాల్‌లోని ఐసీఏఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NIHSAD) శాస్త్రవేత్తలు ఈ టీకాను రూపొందించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నవంబర్ 20న భోపాల్‌లో ఈ టీకాను జాతికి అంకితం చేయనున్నారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో తరచూ బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందుతుండటంతో పెద్ద సంఖ్యలో కోళ్లు, ఇతర పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఈ సమస్యను అరికట్టి పౌల్ట్రీ రంగానికి రక్షణ కల్పించాలనే లక్ష్యంతో NIHSAD కొంతకాలంగా పరిశోధనలు, పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో స్వదేశీ టీకా అభివృద్ధి చేయడం వ్యాధి నియంత్రణలో కీలక పరిణామంగా భావిస్తున్నారు. అయితే ఈ టీకా వాణిజ్యపరంగా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది? పౌల్ట్రీ రంగంలో ఎప్పటి నుంచి వినియోగిస్తారు? అనే వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!