

హైదరాబాద్ మెట్రో రైలు ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఇప్పటి వరకు ఎల్ అండ్ టీ సంస్థ నిర్వహిస్తున్న మెట్రో సేవలను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు షేర్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుని, సుమారు రూ.1,461.47 కోట్లకు వంద శాతం షేర్లను ప్రభుత్వం తీసుకుంది. ఈ ఒప్పందంపై సంబంధిత అధికారులు సంతకాలు చేయగా, మెట్రో ప్రాజెక్ట్‌కు సంబంధించిన భారీ అప్పును కూడా ప్రభుత్వం రీఫైనాన్స్ చేయనుంది.
2017 నవంబర్ నుంచి మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర సేవలు అందిస్తున్న మెట్రో ప్రస్తుతం రోజుకు సుమారు 4.5 లక్షల మంది ప్రయాణికులకు ఉపయోగపడుతోంది. ఇప్పటివరకు సుమారు 86 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోకి రావడంతో ఫేజ్-1, ఫేజ్-2 ప్రాజెక్టుల ప్రణాళిక, అమలు, సేవల సమన్వయం మరింత మెరుగవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ ఒప్పందానికి ముందు ఎల్ అండ్ టీ చైర్మన్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి మరింత సమగ్రంగా, ప్రయాణికులకు అనుకూలంగా మెట్రో సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!