

ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్ సభ్యుడిపై కస్టడీలో వేధింపులకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి ముందస్తు బెయిల్ రక్షణగా మారకూడదని స్పష్టం చేసింది. అలాగే పిటిషనర్‌ను ఉద్దేశించి “ఎప్పటిలోగా సరెండర్ అవుతారు?” అని ప్రశ్నించింది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధిపై కస్టడీలో వేధింపుల ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని హైకోర్టు పేర్కొంది. ఇలాంటి ఘటనల్లో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పాల్గొనకుండా తనను తాను నియంత్రించుకోవాల్సిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించింది. ఎంపీపై వేధింపులు జరగబోతున్న విషయం ముందుగానే తెలిసి ఉండవచ్చని, ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా వెళ్లి పోలీసుల ఎదుట సరెండర్ కావడం మంచిదని హైకోర్టు సూచించింది. ముందస్తు బెయిల్ కోసం పోరాడాలా లేదా సరెండర్ అయ్యే మార్గాన్ని ఎంచుకోవాలా అనే విషయంపై నిర్ణయం తీసుకుని కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది తన క్లయింట్‌తో సంప్రదించి తదుపరి నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. తుది నిర్ణయం తీసుకోకుండా కేసు విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!