

సహోద్యోగినిపై లైంగిక దాడి కేసులో దోషిగా తేలిన తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గోవాలోని మపుసా కోర్టులో లొంగిపోయారు. అనంతరం పోలీసులు ఆయనను జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కోల్వాలే జైలుకు తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తేజ్‌పాల్.. న్యాయవ్యవస్థపై తనకు సంపూర్ణ నమ్మకం ఉందని తెలిపారు. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం కొనసాగిస్తానని చెప్పారు.
2013లో తేజ్‌పాల్‌పై ఓ మహిళా జర్నలిస్టు ఫిర్యాదు మేరకు రేప్ కేసు నమోదైంది. థింక్ ఫెస్ట్ సందర్భంగా హోటల్ ఎలివేటర్‌లో తనపై లైంగిక దాడి చేసినట్లు ఆమె ఆరోపించారు. 2017లో మపుసా ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభం కాగా.. 2021లో కోర్టు తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పును గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టులో సవాల్ చేయగా, 2026 ఆగస్టు 6న హైకోర్టు ఆయనను దోషిగా తేల్చి పదేళ్ల జైలు శిక్ష విధించింది. నెల రోజుల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ తీర్పును తేజ్‌పాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అప్పీల్‌ను విచారించేందుకు మూడు వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో సెప్టెంబర్ 14న ఆయన మపుసా కోర్టులో సరెండర్ అయ్యారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 22కి వాయిదా వేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!