

చాలామందికి అధిక వేతనం, కార్పొరేట్ హోదా, ప్రముఖ సంస్థల్లో ఉన్నత స్థానం విజయానికి ప్రతీకలుగా కనిపిస్తాయి. కానీ హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన తరానా చౌహాన్ మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అంతర్జాతీయ సంస్థ అనహ్యూజర్-బుష్ ఇంబెవ్‌లో సీనియర్ బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేసిన ఆమె, ఏటా రూ.24 లక్షల జీతాన్ని వదిలి రోహ్రూలోని తన వందేళ్ల నాటి పూర్వీకుల ఇంటిని ‘నిర్వాణ హోమ్స్’ పేరుతో విజయవంతమైన హోమ్‌స్టేగా మార్చారు. 2020 కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో సొంతూరికి తిరిగొచ్చిన తరానా ప్రకృతికి దగ్గరగా జీవించాలనే ఆలోచనతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేయకుండా రెండేళ్లపాటు ఉద్యోగం కొనసాగిస్తూనే ఖాళీ సమయంలో పాత ఇంటిని పునరుద్ధరించి మూడు గదులతో హోమ్‌స్టేను ప్రారంభించారు.
కొండ ప్రాంతంలో హోమ్‌స్టే నిర్వహణ అంత సులభం కాదని తరానా చెబుతున్నారు. ప్రత్యేక విభాగాలు లేకపోవడంతో రిసెప్షన్, హౌస్‌కీపింగ్, ప్లంబింగ్, విద్యుత్ పనులతో పాటు పైపుల లీకేజీలు, కరెంట్ కోతలు, గ్యాస్ సిలిండర్ల మార్పు వంటి పనులను కూడా ఆమె స్వయంగా చూసుకుంటున్నారు. ఇప్పటివరకు ‘నిర్వాణ హోమ్స్’ ద్వారా 200 మందికి పైగా పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చారు. నెలకు రూ.5 లక్షలకు పైగా ఆదాయం వచ్చే సందర్భాలు ఉండగా, కొన్ని నెలల్లో రూ.1 లక్ష కంటే తక్కువ ఆదాయం కూడా వస్తుందని తెలిపారు. స్థిరమైన జీతాన్ని వదులుకున్నప్పటికీ, తన సమయం, జీవితం విషయంలో లభించిన స్వేచ్ఛే తనకు నిజమైన సంతృప్తిని ఇస్తోందని తరానా చెబుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!