

అమెరికాలో చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ట్రంప్ ప్రభుత్వం ఎఫ్-1 వీసా విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) కార్యక్రమానికి కొత్త ఫీజును ప్రతిపాదించింది. మొదటిసారి ఓపీటీకి సిఫార్సు చేసే సమయంలో యూనివర్సిటీలు ఒక్కో విద్యార్థికి 70 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతి ఓపీటీ సిఫార్సులు, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) ఓపీటీ పొడిగింపులకు మరో 30 వేల డాలర్ల ఫీజును ప్రతిపాదించారు. ప్రస్తుతం ఓపీటీ కోసం విద్యార్థులు చెల్లించే అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) దరఖాస్తు రుసుము సుమారు 470 నుంచి 520 డాలర్లు మాత్రమే.
ఓపీటీ ద్వారా అమెరికా యూనివర్సిటీల్లో డిగ్రీ పూర్తిచేసిన ఎఫ్-1 విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన రంగంలో సాధారణంగా 12 నెలలపాటు ప్రాక్టికల్ అనుభవం పొందుతూ పనిచేయవచ్చు. అర్హత ఉన్న స్టెమ్ విద్యార్థులకు అదనంగా 24 నెలల పొడిగింపు లభిస్తుంది. ప్రతిపాదిత ఫీజును మొదట యూనివర్సిటీలే చెల్లించాల్సి ఉన్నప్పటికీ, ఆ మొత్తాన్ని విద్యార్థులు లేదా ఉద్యోగాలను కల్పించే సంస్థలపై మోపే అవకాశం ఉంది. మోసాలను అరికట్టడం, వలస వ్యవస్థను పటిష్ఠం చేయడం, అమెరికా కార్మికులను రక్షించడమే లక్ష్యమని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్) చెబుతోంది. ప్రస్తుతం ఇది ప్రతిపాదన మాత్రమే. తుది నిబంధనగా అమల్లోకి రావాలంటే ప్రజాభిప్రాయ సేకరణతో పాటు తదుపరి నియంత్రణ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంటుంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!