

హరీష్ రావు మరోసారి తెలంగాణవాదుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అమెరికా వ్యక్తిగత పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో జరిగిన తెలంగాణవాదుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కష్టపడి పనిచేసిన ఉద్యమకారులను గౌరవించి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లాంగ్ ఐలాండ్‌లో ప్రముఖ ఎన్ఆర్ఐ లక్ష్మణ్ ఏనుగు నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాలకు చెందిన తెలంగాణవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి అమెరికాలో తెలుగు వారికి ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పిస్తున్న తీరు ప్రశంసనీయమని హరీష్ రావు పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో పరిమితులు ఉన్నప్పటికీ అమెరికాలోని ఎన్ఆర్ఐలు తెలంగాణ కోసం ఆర్థికంగా, మానసికంగా గొప్ప సహకారం అందించారని హరీష్ రావు గుర్తుచేశారు. ఉద్యమకారుల్లో కొందరికి అన్యాయం జరిగిందని, కొందరిలో అసంతృప్తి నెలకొన్న విషయాన్ని ఎన్ఆర్ఐలు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ కు అమెరికా ఎన్ఆర్ఐలు అండగా నిలవాలని ఆయన కోరారు. తెలంగాణ సంస్కృతిని అమెరికాలో విస్తరించడంలో లక్ష్మణ్ ఏనుగు చేసిన సేవలు గొప్పవని, తెలంగాణ కవులు, కళాకారులను అమెరికాకు పరిచయం చేసిన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని హరీష్ రావు ప్రశంసించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!