

గుంటూరుకు చెందిన 15 ఏళ్ల బాలిక అదృశ్యం కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన 28 ఏళ్ల యువకుడు మాయమాటలతో బాలికను తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు మూడు నెలలుగా స్థావరాలు మారుస్తూ పలు రాష్ట్రాల్లో తిరుగుతున్నట్లు దర్యాప్తులో తేలింది. బాలిక ఆచూకీ కనిపెట్టడంలో జాప్యంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడంతో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి బాలిక అదృశ్యం కేసును కిడ్నాప్ కేసుగా మార్చారు. పదో తరగతి చదువుతున్న బాలిక జూన్ 9న ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చి తల్లిదండ్రులు నిర్వహిస్తున్న దుకాణానికి వెళ్తున్నానని అమ్మమ్మకు చెప్పి బయటకు వెళ్లింది. ఇంటి నుంచి నగదు, బంగారం తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆమె తిరిగి రాకపోవడంతో మరుసటి రోజు తండ్రి పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీల పరిశీలనలో పర్చూరుకు చెందిన షేక్ జాన్‌సైదా ఆమెను బైక్‌పై తీసుకెళ్లినట్లు గుర్తించారు.
బాలికను గుర్తించేందుకు పోలీసులు పర్చూరు, నెల్లూరు, కోయంబత్తూరు, కేరళలోని పాలక్కాడ్ తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, లాడ్జిల్లో సేకరించిన సమాచారంతో వారి కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పాలక్కాడ్ రైల్వేస్టేషన్ నుంచి సికింద్రాబాద్‌కు రైలులో వచ్చినట్లు, అక్కడి నుంచి బేగంపేట రైల్వేస్టేషన్ చేరుకుని ఆటోలో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు నగదు వినియోగిస్తూ ఆన్‌లైన్ చెల్లింపులకు దూరంగా ఉంటున్నట్లు, ఇప్పటికే పలుమార్లు సెల్‌ఫోన్లు, సిమ్ కార్డులు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. వేర్వేరు సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగిస్తూ పోలీసులను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల నిందితుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాలిక తల్లిదండ్రులను సవాలు చేసినట్లు సమాచారం. సాంకేతిక నిపుణుల సహాయంతో నిందితుడి కదలికలను గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ ఘటనకు మతపరమైన రంగు పులమవద్దని, వదంతులు వ్యాప్తి చేయవద్దని పోలీసులు కోరారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!