

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో అష్టమ అవతారంగా భావించే శ్రీకృష్ణ భగవానుడికి భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో విశిష్ట స్థానం ఉంది. దేవకీదేవి, వసుదేవులకు అష్టమ సంతానంగా శ్రావణమాసం బహుళ అష్టమి తిథిలో జన్మించిన కృష్ణుడు ధర్మం, జ్ఞానం, భక్తి, దైవచైతన్యానికి ప్రతీకగా కొలువబడుతున్నాడు. కృష్ణ నామస్మరణకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం ఉందని పురాణాలు పేర్కొంటాయి. గోకులంలో బాలకృష్ణుడిగా ఆయన చేసిన లీలలు, చిలిపి చేష్టలు, దివ్య ఘట్టాలు నేటికీ భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
శ్రీకృష్ణుడి లీలలు కేవలం కథలుగా కాకుండా ఎన్నో జీవన సందేశాలను అందిస్తాయి. కాళీయ మర్దనం సమాజానికి హాని చేసే దుష్టశక్తులను అంతం చేయడానికి ప్రతీకగా భావించవచ్చు. గోవర్ధనోద్ధరణం తనను నమ్ముకున్నవారిని కష్టాల్లో ఆదుకోవాలనే సందేశాన్ని అందిస్తుంది. కురుక్షేత్రంలో అర్జునుడికి చూపించిన విశ్వరూప దర్శనం దైవం యొక్క అనంతత్వాన్ని తెలియజేస్తుంది. భగవద్గీత ద్వారా అర్జునుడి సందేహాలను నివృత్తి చేయడంతో పాటు కర్తవ్యం, ధర్మం, ఆత్మజ్ఞానం గురించి మానవాళికి శ్రీకృష్ణుడు మార్గదర్శనం చేశాడు. తల్లిదండ్రులు, గురువులను గౌరవించడం, వినయంగా ఉండటం, అందరినీ సమానంగా ఆదరించడం, నమ్మినవారికి అండగా నిలవడం వంటి ఎన్నో విలువలను ఆయన జీవితం నేర్పుతుంది. మధురలో బాలకృష్ణుడిగా, ద్వారక, ఉడుపిలో శ్రీకృష్ణుడిగా, పూరీలో జగన్నాథుడిగా, గురువాయూర్‌లో గురువాయూరప్పన్‌గా, రాజస్థాన్‌లో శ్రీనాథ్‌జీగా శ్రీకృష్ణుడు అనేక రూపాల్లో భక్తుల ఆరాధనలు అందుకుంటున్నాడు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!