

తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్ఫూర్తితో సాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17న పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతంలో 20 వేల మడ మొక్కలను నాటి, వాటికి జియో ట్యాగ్ చేశారు. కేవలం మూడు నెలల్లోనే ఈ మొక్కలు దాదాపు మూడు అడుగుల ఎత్తుకు ఎదిగి పచ్చటి వనంగా కళకళలాడుతున్నాయి. జూన్ 9, 2026న మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ ప్రాంతాన్ని సందర్శించి మొక్కల పెరుగుదలను పరిశీలించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులైన సుందర్బన్ అడవులు తుఫాన్ల నుంచి తీరాన్ని రక్షించడంలో, జీవవైవిధ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతంలో హరిత వికాసం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2018లో ప్రారంభమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఇప్పటివరకు కోట్లాది మొక్కలను నాటి, వేలాది జలవనరులను పునరుద్ధరించింది. పర్యావరణ సంస్థ ఇగ్నైటెడ్ మైండ్స్ ఈ ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!