

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ (అనిశా/ఏసీబీ) ఆదాయానికి మించిన ఆస్తుల కేసులపై దూకుడు పెంచింది. గత కొన్ని వారాలుగా వరుస దాడులు నిర్వహిస్తూ పలువురు అధికారుల వద్ద భారీ స్థాయిలో అక్రమాస్తులను గుర్తిస్తోంది. అధికారిక లెక్కలతో పోలిస్తే మార్కెట్ విలువలు వందల కోట్ల రూపాయలకు చేరుతున్న ఆస్తులు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. వ్యవసాయ భూములు, గృహ స్థలాలు, వ్యాపార పెట్టుబడులు, ఇతర ఆస్తుల రూపంలో పెద్దఎత్తున సంపద కూడబెట్టినట్లు దర్యాప్తులో బయటపడుతోంది.
దర్యాప్తు వేగవంతం కావడంతో కొందరు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు తమ ఆస్తులను రక్షించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. బినామీల పేర్లకు ఆస్తుల బదిలీ, గిఫ్ట్ డీడ్లు, పాత తేదీలతో ఉన్న పత్రాలు, ఆర్థిక నిపుణులు మరియు ఛార్టర్డ్ అకౌంటెంట్ల సలహాలు తీసుకోవడం వంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆస్తులకు సంబంధించిన లావాదేవీలు, పత్రాలు, ఆర్థిక ఆధారాలు పరస్పరం అనుసంధానమై ఉంటాయని, ఒక కీలక ఆధారం దొరికినా మొత్తం ఆస్తుల వ్యవహారం వెలుగులోకి తీసుకురావడం సాధ్యమని అనిశా అధికారులు స్పష్టం చేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!