

పొగాకు వ్యాపార వివాదం నేపథ్యంలో గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకుడు షేక్ మహమ్మద్ ముస్తఫా కుమారుడిపై కిడ్నాప్ ఆరోపణలు నమోదయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం, కొయ్యలగూడెం నుంచి గుంటూరుకు పొగాకు బేళ్లు తరలిస్తున్న ఓ వ్యాపారి కుమారుడు, డ్రైవర్, గుమస్తాను మధ్యలో అడ్డగించి వాహనంతో పాటు బలవంతంగా తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి కుటుంబం ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై సమన్వయ చర్యలు చేపట్టి ముగ్గురినీ సురక్షితంగా విడిపించారు. అనంతరం పలువురు నిందితులు పెదకాకాని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులపై కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసిన వారిని విచారించిన అనంతరం వైద్య పరీక్షలకు తరలించి కోర్టులో హాజరుపర్చేందుకు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, ప్రధాన నిందితుడిగా పేర్కొన్న బషీర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ వైపు వెళ్తున్న అతని కారు సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు గుర్తించి ప్రత్యేక బృందాలను గాలింపునకు పంపారు. మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా ఆచూకీ కోసం కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!