

పశ్చిమాసియా దేశాలపై ఆధారాన్ని తగ్గించి ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయడానికి భారత్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 2027 నాటికి దేశానికి అవసరమైన మొత్తం ఎల్‌పీజీ దిగుమతుల్లో 25 శాతం అమెరికా నుంచే కొనుగోలు చేయాలని కేంద్రం ప్రణాళిక రూపొందిస్తోంది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరా అంతరాయాలను తగ్గించడంతో పాటు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి కూడా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వచ్చే ఒకటి నుంచి రెండు నెలల్లో అంతర్జాతీయ టెండర్లు జారీ చేసే అవకాశముంది. దీనిపై చర్చల కోసం భారత అధికారుల బృందం త్వరలో అమెరికా వెళ్లనుంది. ప్రస్తుతం దేశంలో వినియోగిస్తున్న ఎల్‌పీజీలో సుమారు 66 శాతం దిగుమతుల ద్వారానే వస్తుండగా, దిగుమతుల్లో దాదాపు 90 శాతం పశ్చిమాసియా నుంచే వస్తున్నాయి. అమెరికా నుంచి దిగుమతులు క్రమంగా పెరుగుతుండగా, 2027 నాటికి పెరుగుతున్న దేశీయ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని భారత్ భావిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!