

కార్తీకమాసం సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవస్థానం ఆగమ పాఠశాల ఎదురుగా ఉన్న మైదానంలో ప్రత్యేకంగా భారీ కైలాసం సెట్టింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ అందమైన కైలాసం వేదిక కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
కైలాసం వేదికపై శ్రీ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం దశవిధ హారతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్తీక దీపాలను వెలిగించారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు ఉచితంగా ప్రమిదలు, పూజా సామగ్రిని అందుబాటులో ఉంచారు. దీపాల వెలుగులతో మల్లన్న క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల భాగస్వామ్యంతో కార్యక్రమం ఆద్యంతం భక్తిభావంతో కొనసాగింది.
భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనను మరింత పెంపొందించేందుకు ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు మనో, తన బృందంతో కలిసి భక్తి సంగీత స్వరార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కోటి దీపోత్సవంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, స్థానికులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!