

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఓ భక్తుడు అపూర్వమైన కానుక సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఏకంగా 160 కిలోల బంగారంతో ప్రత్యేకంగా తయారు చేయించిన ఆభరణాలను స్వామివారికి విరాళంగా అందజేయనున్నట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ.250 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్వామివారి అలంకరణ కోసం రూపొందించిన ఈ ఆభరణాలను తొమ్మిది సెట్లుగా తయారు చేయించినట్లు, మొత్తం 45 ఆభరణాలను సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీటీడీకి వీటిని అందజేయనున్నట్లు సమాచారం.
అత్యంత నైపుణ్యం కలిగిన స్వర్ణకారులతో ఈ ఆభరణాలను ప్రత్యేకంగా తయారు చేయించినట్లు తెలుస్తోంది. అయితే వాటి సంఖ్య, ఖచ్చితమైన బరువు, విలువకు సంబంధించి టీటీడీ అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది. తిరుమల శ్రీవారికి భక్తులు బంగారం, వజ్రాలు, నగదు రూపంలో భారీ విరాళాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఒకే భక్తుడు ఇంత భారీ స్థాయిలో బంగారు ఆభరణాలను అందజేయనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ విరాళం అందజేసే భక్తుడు ఎవరనే అంశంతో పాటు ఆభరణాలను స్వామివారికి ఎప్పుడు అలంకరిస్తారనే విషయాలపై ఆసక్తి నెలకొంది. ఈ నెల 26న జరిగే సమర్పణ కార్యక్రమం అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!