

గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో రూ.29 కోట్లతో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వివరాలు వెల్లడించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసేలా నిర్వహిస్తామని చెప్పారు. అలాగే నదీ పరివాహక ప్రాంతంలోని 43 ఆలయాల అభివృద్ధికి రూ.54.71 కోట్లు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని వేలాది దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ధూప, దీప, నైవేద్యాల కోసం అర్చకులకు ప్రతి సంవత్సరం నిధులు అందిస్తున్నామని చెప్పారు. ఆలయాలు లేని గ్రామాలు, కాలనీల్లో భజన మందిరాల నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. వేద విద్యను అభ్యసించే విద్యార్థులకు నెలవారీ భృతి అందించడంతో పాటు, రామతీర్థం మరియు శ్రీకాళహస్తిలో గిరిప్రదక్షిణ మార్గాల నిర్మాణ పనులు కూడా చేపడుతున్నామని మంత్రి వివరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!