

తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకాన్ని ప్రారంభించింది. డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలనలో బీసీ మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. 100 శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించి, మహిళలను కేవలం పథకాల లబ్ధిదారులుగా కాకుండా స్వయం ఉపాధి పొందే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు.
రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నారు. ఒక్కో మిషన్ విలువ రూ.12,000 కాగా, లబ్ధిదారులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిస్థాయి సబ్సిడీపై అందజేస్తారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అర్హులైన బీసీ మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, వికలాంగులు, కుట్టు వృత్తిలో అనుభవం ఉన్న మహిళలకు నిబంధనల ప్రకారం ప్రాధాన్యం ఇస్తారు. మొదటి దశలో 1.19 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కల్పించనుండగా, భవిష్యత్‌లో పథకాన్ని మరింత విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!