

నేపాల్‌లో మెరుపు వరదల ఘటన మరువకముందే భూటాన్‌లో మరో ప్రకృతి విపత్తు సంభవించింది. వాయవ్య భూటాన్‌లోని గాసా జిల్లాలో షింటాఫు హిమానీనద సరస్సు ఉప్పొంగడంతో భారీ వరద ప్రవాహం మొదలైంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలోని పలు ప్రాంతాలకు మెరుపు వరదల ముప్పు పొంచి ఉందన్న అంచనాలతో ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. మో చు నది పరివాహక ప్రాంతంలోని గాసా త్చాచు వేడినీటి బుగ్గ వద్ద ఉన్న సౌకర్యాలు వరదలో కొట్టుకుపోయాయి. అయితే ముందుగానే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టం తప్పింది.
వరదనీరు ప్రస్తుతం దిగువ ప్రాంతాల వైపు ప్రవహిస్తూ శ్రీగాంగ్ ప్రాంతాన్ని దాటింది. దీంతో అస్సాంలోని ధుబ్రి, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండ ప్రాంతాలు, అలీపుర్‌దువార్, జల్‌పాయిగురి జిల్లాలకు ముప్పు పొంచి ఉంది. భూటాన్ ఇప్పటికే భారత రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్ అధికారులు సకోశ్ నది పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. హిమాలయాల్లో ప్రమాదకరంగా గుర్తించిన 17 హిమానీనద సరస్సుల్లో షింటాఫు కూడా ఒకటి. మో చు నది ఈ సరస్సు నుంచే ప్రారంభమవుతుంది. 2021లోనూ నది ప్రవాహ మార్గం మారడంతో గాసా త్చాచు వద్ద పలు నిర్మాణాలు, సౌకర్యాలు దెబ్బతిన్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!