

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) పరిధిలోని హాస్టళ్లలో అనుమానిత ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఎం అనెక్సీ, ఎన్‌ఆర్‌ఎస్ హాస్టళ్లలో ఉంటున్న 30 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుల్లో కొందరు వర్సిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతుండగా.. మరికొందరిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు.
హాస్టల్ మెస్‌లలో నాసిరకం ఆహారం, ఇతర సమస్యలు నెలకొన్నాయని విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకు సత్వర వైద్యం అందించేందుకు క్యాంపస్‌లో అత్యవసర వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరారు. ఇంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురైనా వీసీ, రిజిస్ట్రార్ స్పందించకపోవడంపై విద్యార్థి సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ఫుడ్ పాయిజన్‌తో ఇబ్బందిపడుతున్న విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్‌లో సడలింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!