

ఫ్లై దుబాయ్ విమాన కాక్‌పిట్‌లో భారత పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై ఒమానీ సహ పైలట్ హమామ్ అల్-హమ్మామి గొడ్డలితో దాడి చేసిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో స్మిట్ మచ్చార్ పుర్రెకు పగులు ఏర్పడటంతో పాటు తలకు, చేతికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గొడ్డలి దెబ్బ కంటి నరాలపై ప్రభావం చూపడంతో ఆయన చూపు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన సంభాషణలో ఘటనను వివరించిన స్మిట్ మచ్చార్.. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సమయంలో వరుస దెబ్బల కారణంగా చూపు దాదాపు పూర్తిగా కోల్పోయి, అంతా మసకగా కనిపించిందని చెప్పినట్లు సమాచారం.
విమానం సౌదీ అరేబియాలో దిగిన అనంతరం స్మిట్ మచ్చార్‌కు అక్కడి అధికారులు పుర్రె పగులుకు చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను యూఏఈకి తరలించారు. ప్రస్తుతం అబుదాబిలోని ప్రత్యేక వైద్య కేంద్రంలో చికిత్స పొందుతున్న ఆయన తీవ్రమైన తలనొప్పులతో బాధపడుతున్నట్లు, అధిక మోతాదులో మత్తు, నొప్పి తగ్గించే మందులు అందిస్తున్నట్లు సమాచారం. గాయాల ప్రభావం జ్ఞాపకశక్తిపైనా పడటంతో వైద్యులు నరాల పనితీరును పరిశీలిస్తున్నారు. క్రమంగా నడవడం, ఆహారం తీసుకోవడం ప్రారంభించిన ఆయన త్వరగా కోలుకుని మళ్లీ విమానం నడపాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. చూపు పూర్తిగా కోలుకునేలా వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండగా, యూఏఈ దర్యాప్తు సంస్థలు ఆయన ప్రాథమిక వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సమాచారం.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!