

ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ దాడి చేసిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనకు సంబంధించి కెప్టెన్ మచ్చర్ కీలక వివరాలను వెల్లడించారు. విమానం నడుపుతున్న సమయంలో కో-పైలట్ ప్రార్థన చేసుకుంటానని చెప్పి తన వెనుకకు వెళ్లాడని, ఈ ప్రాంత పైలట్లకు ప్రార్థనలు చేసుకోవడం సాధారణమే కావడంతో తాను అభ్యంతరం చెప్పలేదని తెలిపారు. అయితే కొన్ని నిమిషాల తర్వాత కాక్‌పిట్‌లో ఉన్న గొడ్డలితో తనపై వెనుక నుంచి దాడి జరిగినట్లు వివరించారు.
దాడి అనంతరం ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కాక్‌పిట్ తలుపులు తెరిచి సాయం కోరినట్లు కెప్టెన్ మచ్చర్ తెలిపారు. కో-పైలట్ అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. నిందితుడిగా భావిస్తున్న ఒమన్‌కు చెందిన 29 ఏళ్ల హమామ్ అల్-హమ్మామీ గతంలో ఆస్ట్రేలియాలో విద్యార్థిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతడి గత కార్యకలాపాలపై సంబంధిత భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, అల్‌ఖైదా అతడికి మద్దతుగా ప్రచారం నిర్వహించినట్లు వచ్చిన నివేదికలపై కూడా దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!