

పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపుర్ మియా బజార్‌కు చెందిన చక్రవర్తి కుటుంబం దుర్గా పూజ దాదాపు 200 ఏళ్లుగా ప్రత్యేక సంప్రదాయాలతో కొనసాగుతోంది. సాధారణంగా మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తే, ఈ కుటుంబం మాత్రం పట్‌చిత్రంపై చిత్రించిన దుర్గాదేవి రూపాన్నే అమ్మవారి స్వరూపంగా భావించి ఆరాధిస్తోంది. షష్టి నుంచి దశమి వరకు ఐదు రోజులపాటు జరిగే వేడుకల్లో బోధన్, ఏడు బావుల నుంచి సేకరించిన నీటితో కలశ పూజ, సప్తమి నుంచి నవమి వరకు మహాయజ్ఞం వంటి సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. గతంలో జంతుబలి ఆచారం ఉండగా, ప్రస్తుతం దాని స్థానంలో బూడిద గుమ్మడికాయను ప్రతీకాత్మకంగా సమర్పిస్తున్నారు.
ఈ పూజలో అమ్మవారికి చేపల వంటకాలను నైవేద్యంగా సమర్పించడం మరో ప్రత్యేకత. కుటుంబ సభ్యుల విశ్వాసం ప్రకారం, దుర్గాదేవి కైలాసానికి తిరిగి వెళ్లిన తర్వాత శివుడు పుట్టింట్లో ఏం తిన్నావని అడుగుతాడనే భావనతో, అమ్మవారు పుట్టింట్లో స్వీకరించిన ఆహారానికి ప్రతీకగా చేపల వంటకాలను సమర్పించే సంప్రదాయం కొనసాగుతోంది. అష్టమి రోజున 108 నీలి కలువలతో ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. దశమి నాడు సంప్రదాయ ఆచారాల అనంతరం నిమజ్జనం చేస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు ఈ వేడుక కోసం స్వస్థలానికి చేరుకోవడం ఆనవాయితీగా మారింది. కాలానుగుణంగా కొన్ని మార్పులు వచ్చినా, పూర్వీకుల నుంచి వచ్చిన ప్రధాన ఆచారాలను కొనసాగిస్తూ చక్రవర్తి కుటుంబం తమ ప్రత్యేక దుర్గా పూజ సంప్రదాయాన్ని కాపాడుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!