

రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానంతో సాధిస్తున్న పురోగతికి నిదర్శనంగా మరో కీలక ఘట్టం విశాఖపట్నంలో ఆవిష్కృతమైంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంగళవారం ఇక్కడి హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్)లో ఫ్లీట్ సపోర్ట్ షిప్-1 (ఎఫ్ఎస్ఎస్-1)ని లాంఛనంగా జలప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నౌకాదళాధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, రక్షణ ఉత్పత్తి కార్యదర్శి సంజీవ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
భారత నౌకాదళం కోసం మొత్తం ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లను హెచ్ఎస్ఎల్ నిర్మిస్తుండగా, ఇది వాటిలో మొదటిది. కేవలం 18 నెలల వ్యవధిలోనే స్టీల్ కటింగ్ దశ నుంచి జలప్రవేశం స్థాయికి చేరుకోవడం విశేషం. సుమారు 43,500 టన్నుల బరువుండే ఈ నౌకలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుదీర్ఘకాలం పనిచేసేందుకు వీలుగా యుద్ధనౌకలకు సముద్రంలోనే ఇంధనం, ఆహారం, ఇతర సామగ్రిని అందిస్తాయి. దీంతో నౌకాదళ కార్యాచరణ సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. ఇదే కార్యక్రమంలో రాజ్‌నాథ్‌సింగ్ ఐదో ఫ్లీట్ సపోర్ట్ షిప్ (ఎఫ్ఎస్ఎస్-5) నిర్మాణానికి కీల్ లేయింగ్ (శంకుస్థాపన) చేశారు. అనంతరం హెచ్ఎస్ఎల్‌లో ఆధునికీకరించిన స్లిప్‌వే-4, 300 టన్నుల సామర్థ్యం గల గోలియత్ క్రేన్‌ను కూడా రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ నూతన సౌకర్యాలతో 45,000 డీడబ్ల్యూటీ వరకు బరువున్న అతిపెద్ద నౌకలను నిర్మించే సామర్థ్యం హెచ్ఎస్ఎల్‌కు లభిస్తుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!