

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా మల్లాపూర్‌లో ‘అంగన్ మిలన్ సేవ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో కలిసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గర్భిణులు, నవజాత శిశువులు, చిన్నారుల సంక్షేమం కోసం క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లను సత్కరించి వారి సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పేదలు, ప్రతి కుటుంబానికి చేరవేయడంలో వారు ముఖ్యమైన వారధులుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకమని, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయడంలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మహిళలకు మరింత గౌరవం, మద్దతు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డి. గిరివర్ధన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. శిల్పా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!