

అరుదైన జన్యుపరమైన వ్యాధి అలన్-హెర్న్డన్-డడ్లీ సిండ్రోమ్ (AHDS)తో బాధపడుతున్న ఏడుగురు చిన్నారుల జీవితాల్లో హైదరాబాద్కు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్ కొత్త ఆశలు నింపారు. ఈ వ్యాధికి ఉపయోగించే అత్యంత ఖరీదైన టిరాట్రికోల్ (Tiratricol) ఔషధాన్ని తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. యాక్సెస్ టు మెడిసిన్స్ ఇండియా, అంతర్జాతీయ ఫౌండేషన్ సహకారంతో ఈ ప్రయత్నం సాధ్యమైంది. గతంలో ఒక్కో చిన్నారికి ఏడాదికి ఈ మందు కోసం సుమారు రూ.9 కోట్ల వరకు ఖర్చు అయ్యేది. తాజా ప్రయత్నాలతో ఆ వ్యయాన్ని దాదాపు రూ.2.5 లక్షలకు తగ్గించినట్లు సమాచారం. దీంతో ఖరీదైన చికిత్సను భరించలేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు భారీ ఊరట లభించనుంది.
మరోవైపు, ఈ ఏడుగురు చిన్నారులకు 2026 నవంబర్ 30న ఏడాదికి సరిపడా టిరాట్రికోల్ మందును పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులకు అవసరమైన చికిత్స అందడంతో పాటు వారి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుంది. అరుదైన వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ప్రాణాధారమైన మందులు అందుబాటులోకి తీసుకురావడానికి డాక్టర్ శివరంజని సంతోష్ చేసిన కృషిపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆమెతో పాటు సహకరించిన సంస్థల ప్రయత్నం అరుదైన వ్యాధుల చికిత్సలో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!