

సీఈసీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నవంబర్ 1న నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ మెగా ర్యాలీని వాయిదా వేయాలని దిల్లీ వ్యాపార సంఘాలు కోరాయి. దీపావళి పండగ వేళ నిరసన కార్యక్రమం నిర్వహిస్తే తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు ర్యాలీని వాయిదా వేయాలని రాహుల్ గాంధీని పలుమార్లు అభ్యర్థించినప్పటికీ సానుకూల స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) లేఖ రాసింది. వ్యాపారాలపై ఆధారపడిన కుటుంబాల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ర్యాలీని నవంబర్ 10 లేదా 11వ తేదీలకు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది.
ఒకవేళ తేదీని మార్చడం సాధ్యం కాకపోతే వాణిజ్య ప్రాంతాలకు దూరంగా నిరసన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని సీటీఐ కోరింది. తాము రాజకీయ నిరసనలకు వ్యతిరేకం కాదని, పండగ సీజన్‌లో వ్యాపారాలు, జీవనోపాధిపై పడే ప్రభావంపైనే ఆందోళన చెందుతున్నామని సంస్థ ఛైర్మన్ బ్రిజేశ్ గోయల్ లేఖలో పేర్కొన్నారు. ఈ ర్యాలీకి లక్షలాది మంది నిరసనకారులతో పాటు సుమారు 20 వేల వాహనాలు వచ్చే అవకాశం ఉందని, దీనివల్ల దిల్లీలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో దాదాపు రూ.12 వేల కోట్ల వ్యాపారం ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని ఆయన వివరించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!