

తుఫాన్ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. నరసాపురం మండలం కొత్తనవరసపురంలో పర్యటించిన ఆయన.. బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పంటలకు ఎంతమేర బీమా చేయిస్తున్నారని ఆరా తీశారు. ప్రకృతి విపత్తులు, ఇతర కారణాలతో పంట నష్టం వాటిల్లినప్పుడు బీమా ద్వారా పరిహారం పొందవచ్చని వివరించారు. ఈ-పంట విధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరానికీ బీమా కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇన్‌పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు నష్టపరిహారం అందిస్తున్నామని చెప్పారు. రైతులు తమ పంటలకు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని సూచించారు. కష్టకాలంలో రైతులకు నష్టం కలగకుండా చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రైతులు సహకరిస్తే వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలమని చంద్రబాబు హామీ ఇచ్చారు.
పంట కాలువల్లో కొన్ని చోట్ల నీటి ప్రవాహం లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డెల్టా ప్రాంతంలో కాలువల ఆధునీకరణకు రూ.3 వేల కోట్లు కేటాయించామని, త్వరలో సమస్యను పరిష్కరిస్తామని చంద్రబాబు తెలిపారు. తుఫాన్ కారణంగా ప్రాణనష్టం జరిగిందా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు, హెచ్చరికలు జారీ చేయడంతో ప్రాణనష్టం జరగలేదని వారు వివరించారు. గాలులకు కూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లను అధికారులు వెంటనే తొలగించినట్లు తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన సీఎం.. కార్మికులు, సిబ్బందిని అభినందించారు. నరసాపురం నుంచి మాట్రేవు వెళ్లే మార్గంలో దెబ్బతిన్న కొబ్బరి తోటలను కూడా పరిశీలించారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని, తద్వారా పంటలకు డిమాండ్ పెరుగుతుందని సూచించారు. నాలుగున్నర ఎకరాల్లో నవధాన్యాలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నట్లు ఓ మహిళా రైతు ముఖ్యమంత్రికి వివరించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!