

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మంజుశ్రీ వెంకటమహాలక్ష్మి తన ఆత్మస్థైర్యం, పట్టుదలతో అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. పి.గన్నవరం మండలం కఠార్లంక గ్రామానికి చెందిన ఈ విద్యార్థిని నిరుపేద కుటుంబంలో జన్మించింది. తండ్రితో పాటు తాను, చెల్లెలు కూడా దివ్యాంగులే. కుటుంబం రూ.15 వేల పింఛను, ఇంటి వద్ద నడిపే చిన్న బడ్డీకొట్టుపైనే ఆధారపడి జీవిస్తోంది. పదోతరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో ఆమె తల్లి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దాతల సహకారంతో కోలుకున్నప్పటికీ తర్వాత కిడ్నీ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటూనే చదువుపై దృష్టి కోల్పోకుండా కష్టపడి చదివిన మంజుశ్రీ తాజాగా విడుదలైన ఎస్సెస్సీ ఫలితాల్లో 600కు 567 మార్కులు సాధించింది. ఆర్.ఏనుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఆమె భవిష్యత్తులో ఐఐటీలో చేరి ఉన్నత విద్యాభ్యాసం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాతలు సహకరిస్తే తన కలను నిజం చేసుకుంటానని ఆమె ఆత్మవిశ్వాసంగా చెబుతోంది. కష్టాలను జయించి విజయాన్ని సాధించిన ఈ విద్యార్థిని కథ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!