

అక్వాన్ తుపాను దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. బుధవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడనుండగా, గురువారం సాయంత్రానికి మరింత తీవ్రత పెరిగి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మంగళవారం రాత్రికి ఈ తుపాను చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 650 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 660 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సముద్రంలో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతున్న తుపాను, శుక్రవారం మధ్యాహ్నం కాకినాడ–విశాఖపట్నం మధ్య కాకినాడ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయానికి కొంత బలహీనపడే అవకాశముంది.
తుపాను ప్రభావంతో బుధవారం నుంచి కోస్తాంధ్రలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 19, 20 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో 21 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం గంటకు 100–120 కిలోమీటర్ల వేగంతో, గురువారం గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నెల 21న కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!