

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త జన్యుమార్పులతో కొనసాగుతున్న నేపథ్యంలో PJ.2.1 అనే కొత్త వేరియంట్‌పై ఆరోగ్య నిపుణులు దృష్టి సారించారు. JN.1 కుటుంబానికి చెందిన ఈ వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పర్యవేక్షణలో ఉన్న వేరియంట్ల జాబితాలో చేర్చింది. స్పైక్ ప్రోటీన్‌లో గణనీయమైన జన్యుమార్పులు చోటుచేసుకున్న ఈ వేరియంట్ నవంబర్ 8 నాటికి 18 దేశాల్లో గుర్తించినట్లు నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా కెనడా, అమెరికాలో దీని వ్యాప్తి పెరుగుతున్నట్లు సమాచారం. స్పెయిన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లోనూ ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
PJ.2.1 మానవ కణాల్లోని ACE2 గ్రాహకాలతో బలంగా అనుసంధానమయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉందని ప్రయోగశాల అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే LP.8.1, XFG వేరియంట్లకు అనుగుణంగా రూపొందించిన వ్యాక్సిన్ల ద్వారా ఉత్పత్తయ్యే యాంటీబాడీలు ఈ కొత్త వేరియంట్‌ను ప్రయోగశాల పరీక్షల్లో అడ్డుకోగలిగినట్లు పరిశోధనలు వెల్లడించాయి. ఇప్పటివరకు PJ.2.1 వల్ల వ్యాధి తీవ్రత పెరుగుతుందని నిర్ధారించే ఆధారాలు లేవని WHO స్పష్టం చేసింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దీని అదనపు ప్రజారోగ్య ముప్పు తక్కువగా ఉందని అంచనా వేసింది. అయితే వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలి. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. కొత్త వేరియంట్ వ్యాప్తిని అర్థం చేసుకోవడానికి నిరంతర పర్యవేక్షణ, జన్యు పరీక్షలు అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!