

‘కాక్‌రొచ్ జనతా పార్టీ’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్య రాజకీయ ప్రచారం నిర్వహిస్తున్న వేదికపై ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రచారానికి మహారాష్ట్రకు చెందిన అభిజీత్ దిప్కే అనే వ్యక్తి సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన అమెరికాలోని ఇల్లినాయిస్, ఫ్లోరిడా ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు సమాచారం. ఈ వేదిక యువతను ఆకర్షించే వినోదాత్మక చిత్రాలు, వ్యంగ్య వీడియోలు, సామాజిక అంశాలపై ప్రచారాలతో గుర్తింపు పొందింది.
ఈ ప్రచార వేదిక నిరుద్యోగం, పరీక్షల అవకతవకలు, విద్యార్థుల సమస్యలు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా వ్యవహరిస్తోందని చెబుతున్నారు. వివిధ వేదికల్లో ఒకే తరహా సందేశాలు, దృశ్యాలు, ప్రచార పద్ధతులు కనిపించడం వెనుక కేంద్రీకృత సమన్వయం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని వినోదాత్మక ప్రచార శైలిని అనుసరిస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
ఈ వేదికకు సంబంధించిన ఖాతాలు అమెరికా కేంద్రంగా నమోదై ఉన్నట్లు సమాచారం. అలాగే విదేశాల్లో ఉన్న కొన్ని ఖాతాల నుంచి ప్రచారానికి మద్దతు లభిస్తున్నట్లు కూడా చర్చ జరుగుతోంది. ఇటీవల ‘కాక్‌రొచ్ జనతా పార్టీ’కు సంబంధించిన సామాజిక మాధ్యమ ఖాతా నిలిపివేయబడినట్లు సమాచారం. అయితే ఈ అంశాలపై అధికారిక ధృవీకరణ మాత్రం వెలువడాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!