

తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 50 వేల గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా మొదటి తారీఖునే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, ఐఏఎస్ అధికారులకు సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బందికీ జీతాలు అందాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతినెలా ₹50 కోట్లు ప్రత్యేకంగా కేటాయిస్తుందని వెల్లడించారు.
అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు మొదటి తారీఖునే వేతనాలు అందాలని సీఎం ఆదేశించారు. జీతాల్లో ఒక్కరోజు ఆలస్యమైనా సహించబోమని హెచ్చరించారు. గ్రామ పంచాయతీల స్వంత ఆదాయ హక్కులను పునరుద్ధరించేలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేయాలని సూచించారు. అలాగే పోస్టల్ శాఖ ద్వారా జరుగుతున్న పెన్షన్ పంపిణీ విధానాన్ని మార్చి, నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానం అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆధార్, ఓటర్ ఐడీ, సర్వే డేటా ఆధారంగా అర్హులకు మాత్రమే పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!