

తెలంగాణలో పట్టణ మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.20 వేల కోట్లతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టాలని పురపాలక శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB), ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (AIIB), జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ (KfW) బ్యాంకుతో పాటు దేశీయ ఆర్థిక సంస్థల సహకారంతో ఈ ప్రాజెక్టులకు నిధులు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. వాతావరణ మార్పులను తట్టుకునేలా, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పట్టణాలను అభివృద్ధి చేయాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీ, వర్షపు నీటి పారుదల వ్యవస్థల ఏర్పాటు, వరంగల్ కోట చుట్టూ ఉన్న కందకం పునరుద్ధరణ, హనుమకొండలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి ప్రతిపాదనలను సమావేశంలో సమీక్షించారు. పట్టణాల్లో మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకునేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని నిర్ణయించారు.
శుద్ధి చేసిన మురుగునీటిని పరిశ్రమలకు, ముఖ్యంగా టెక్స్టైల్ పార్కులకు వినియోగించడం ద్వారా మంచినీటి వనరులపై ఒత్తిడిని తగ్గించవచ్చని సమావేశంలో అభిప్రాయపడ్డారు. పట్టణాల్లో తాగునీటి సరఫరా, నీటి శుద్ధి, పంపిణీ వ్యవస్థల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించడంపై సీఎం పలు సూచనలు చేశారు. వరంగల్ మెగా సిటీ ఎకనామిక్ రీజియన్ పరిధిలో వ్యర్థాల నుంచి 10–12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించారు. బయో సీఎన్జీ ఉత్పత్తి, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుపైనా చర్చించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించడం, నీటి వనరులను సంరక్షించడం, పట్టణాల్లో వరద ముప్పును నివారించడం, పురపాలక సంస్థల నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంవో కార్యదర్శి మాణిక్ రాజ్, పురపాలక శాఖ కార్యదర్శి టి.కె. శ్రీదేవి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!