

క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో తాగునీటి సరఫరాకు సంబంధించి సమగ్ర తాగునీటి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు, విలీన మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరాలో ఏకరూపత ఉండేలా చర్యలు తీసుకోవాలని, రానున్న 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు.
హైదరాబాద్ మహానగర తాగునీటి సరఫరా, సీవరేజ్ బోర్డు పనులపై సమీక్ష నిర్వహించిన సీఎం, నగరంలోని అన్ని తాగునీటి వనరులను పరస్పరం అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం మూడు లేదా నాలుగు రోజులకు ఒకసారి నీరు అందుతున్న ప్రాంతాలకు వెంటనే రోజు విడిచి రోజు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న తాగునీటి, ఎస్టీపీ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, ప్రతి నెల పనుల పురోగతిపై డ్యాష్‌బోర్డ్ ద్వారా నివేదిక సమర్పించాలని చెప్పారు. పరిశ్రమలు, నిర్మాణ రంగంలో గ్రే వాటర్ వినియోగాన్ని ప్రోత్సహించే విధంగా నిబంధనలు రూపొందించాలని కూడా సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!