

దేశవ్యాప్తంగా వాయు కాలుష్యంపై చర్చ జరుగుతున్న వేళ.. ఆంధ్రప్రదేశ్‌లోని స్వచ్ఛమైన వాతావరణాన్ని పెట్టుబడిదారులను ఆకర్షించే అంశంగా మంత్రి నారా లోకేశ్ ప్రస్తావించారు. పరిశ్రమలు స్థాపించడానికే పరిమితం కాకుండా, తమ కార్పొరేట్ ప్రధాన కార్యాలయాలను కూడా ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో మాట్లాడిన ఆయన.. విశాఖపట్నం, అమరావతి లేదా రాయలసీమలో తమ సంస్థల ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతిభావంతమైన మానవ వనరులు, మెరుగైన కనెక్టివిటీ, నాణ్యమైన జీవన ప్రమాణాలు, సమర్థవంతమైన పాలన ఏపీకి ప్రధాన బలాలని వివరించారు.
రాష్ట్రంలో స్వచ్ఛమైన గాలి, అందమైన సముద్రతీరం, ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండటం పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయని లోకేశ్ పేర్కొన్నారు. ఐటీ, క్వాంటమ్ టెక్నాలజీ, తయారీ రంగాల్లో నైపుణ్యం కలిగిన యువతతో పాటు పోర్టు మౌలిక సదుపాయాలు, విస్తరిస్తున్న విమానాశ్రయ కనెక్టివిటీ రాష్ట్రానికి అదనపు ప్రయోజనాలని తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్ టెక్నాలజీ, అధునాతన తయారీ రంగాల్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పెట్టుబడిదారులకు అందుబాటులో ఉండే పాలన, వేగంగా అనుమతులు, ప్రాజెక్టుల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!