

డిక్సన్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పంకజ్ శర్మ విశాఖపట్నంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్-II (EMC-II)లో అదనంగా రూ.700 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు పంకజ్ శర్మ ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదిత పెట్టుబడి ద్వారా రాష్ట్ర యువతకు సుమారు 2,300 ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. తిరుపతి, కొప్పర్తిలో కంపెనీ విస్తరణ ప్రణాళికలు రూపొందిస్తున్నందుకు మంత్రి లోకేశ్ డిక్సన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
డిక్సన్-ఇన్వెంటెక్ జాయింట్ వెంచర్ ద్వారా ఏపీలో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, సర్వర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని మంత్రి కంపెనీని ఆహ్వానించారు. 2018 నుంచి తిరుపతిలో షియోమీతో పాటు ఇతర బ్రాండ్ల కోసం ఎల్‌ఈడీ టీవీలను తయారు చేస్తున్నామని, అక్కడ తమకు ఇన్‌హౌస్ ఎల్‌సీఎం లైన్‌తో కూడిన భారీ తయారీ ప్లాంట్ ఉందని పంకజ్ శర్మ వివరించారు. అలాగే కడప జిల్లా కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ (సీపీ ప్లస్) యూనిట్‌ను రూ.450 కోట్లతో విస్తరిస్తున్నామని, ఈ ప్రాజెక్టు ద్వారా 7,000 ఉద్యోగాలు కల్పించనున్నామని తెలిపారు. ఈ విస్తరణకు ఇప్పటికే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) ఆమోదం లభించిందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని పంకజ్ శర్మ వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!