

ఆంధ్రప్రదేశ్‌ను సముద్ర సాంకేతికత, రక్షణ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెను ఇండో-పసిఫిక్ ప్రాంతానికి మారిటైమ్ రోబోటిక్స్ ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చేయాలని మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా సాగర్ డిఫెన్స్ ఫౌండర్ కెప్టెన్ నికుంజ్ పరాశర్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సముద్ర రక్షణ సాంకేతికతలు, మానవరహిత నౌకల తయారీ, రోబోటిక్స్, నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై చర్చించారు.
జువ్వలదిన్నెలో మారిటైమ్ అటానమీ, రోబోటిక్స్ స్కిల్లింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, ఐఐటీ తిరుపతి, ఆంధ్రా యూనివర్సిటీ సహకారం తీసుకోవాలని లోకేష్ సూచించారు. మానవరహిత నౌకల సముద్ర పరీక్షలు, నిర్వహణ, మరమ్మతులు, హార్బర్ భద్రత, హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం ప్రత్యేక ప్రాజెక్టులు చేపట్టాలని ప్రతిపాదించారు. అలాగే డ్రోన్లు, బ్యాటరీలు, సెన్సార్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలను ఏపీకి ఆహ్వానించారు. స్థానిక మత్స్యకార కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్మార్ట్ ఫిషింగ్ ఫ్లీట్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని కెప్టెన్ నికుంజ్ పరాశర్ తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!