

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో జియో మైసూర్ సంస్థ ఏర్పాటు చేసిన బంగారం ఉత్పత్తి కర్మాగారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి, రెండో యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇది ఆంధ్రప్రదేశ్‌లో సువర్ణ యుగానికి నాంది అని పేర్కొన్నారు. ప్రారంభంలో ఏడాదికి 400 కిలోల బంగారం ఉత్పత్తి చేసి, భవిష్యత్తులో 1,500 కిలోల వరకు సామర్థ్యాన్ని పెంచనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 5,000 మందికి ఉపాధి లభిస్తుందని, రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని చెప్పారు. జొన్నగిరిలోనే భారీ జ్యువెలరీ పార్క్‌ను ఏర్పాటు చేసి బంగారు ఆభరణాల తయారీని కూడా ప్రోత్సహిస్తామని వెల్లడించారు.
చారిత్రక ప్రాధాన్యం ఉన్న జొన్నగిరికి "స్వర్ణగిరి" అనే పేరును ప్రకటిస్తూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల విస్తరణతో రాయలసీమకు కొత్త గుర్తింపు తీసుకువస్తామని చెప్పారు. జియో మైసూర్ సంస్థ ఛైర్మన్ బి. ప్రభాకరన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి దార్శనికత వల్లే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని, ప్రపంచ స్థాయి గనుల ప్రమాణాలతో స్వర్ణగిరిని ఆదర్శ గోల్డ్ ఫీల్డ్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!