

టీడీపీ పొలిట్ బ్యూరో 2026 మహానాడును “స్త్రీ శక్తి” థీమ్‌తో నిర్వహించాలని నిర్ణయించింది. మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టాలని భేటీలో ఆమోదం లభించింది. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వర్చువల్‌గా జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో నారా లోకేష్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో మహానాడు నిర్వహణ, తీర్మానాల రూపకల్పన, ప్రధాన అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలను ప్రధానంగా చూపించాలని, పార్టీ ఆవిర్భావం నుంచి తీసుకున్న నిర్ణయాలను వివరించాలని చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన 10 తీర్మానాలు, తెలంగాణకు 4, అండమాన్‌కు 1, అలాగే ఉమ్మడి తీర్మానాలు మరియు కీలక రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
“స్త్రీ శక్తి” థీమ్‌ను ప్రతిబింబించేలా ప్రసంగాలు ఉండాలని సీఎం ఆదేశించారు. మహానాడును పండుగలా నిర్వహించాలని, రెండు రోజుల ముందే ప్రతి ఇంటిపై టీడీపీ జెండా ఎగరేయాలని సూచించారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలు, పార్టీ చరిత్ర, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, పెట్టుబడులపై విస్తృత ప్రజెంటేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు.
హైబ్రిడ్ విధానంలో జరిగే ఈ మహానాడు పార్టీ భావజాలాన్ని నేటి తరానికి తెలియజేసే వేదికగా ఉండనుంది. ప్రతిపక్షాల వైఖరిని ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు. చివరగా ప్రతి స్థాయి కార్యకర్తను మహానాడులో భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!