

కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఆచూకీ కోల్పోయిన ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా బయటపడటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆగస్టు 3న ఏడుగురు మత్స్యకారులతో సముద్రంలోకి వెళ్లిన బోటు సాంకేతిక లోపానికి గురై, బలమైన గాలుల కారణంగా వేరే ప్రాంతానికి కొట్టుకుపోయింది. నిర్ణీత సమయంలో బోటు తిరిగి రాకపోవడంతో అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
మత్స్యకారుల ఆచూకీ కోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌ను సీఎం చంద్రబాబు అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్షించారు. నేవీ, కోస్ట్ గార్డ్, సెంట్రల్ మెరైన్ విభాగాలతో రాష్ట్ర అధికారులు సమన్వయం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ కోస్ట్ గార్డ్, శంకర్‌పూర్ ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలోని మత్స్యకారులను కూడా అప్రమత్తం చేశారు. చివరకు శంకర్‌పూర్ సమీపంలో బోటుతో పాటు ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా రక్షించారు. ఈ ఆపరేషన్‌లో శ్రమించిన అధికారులను సీఎం అభినందించారు. మత్స్యకారులు స్వస్థలాలకు సురక్షితంగా చేరేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!